బయోఫౌలింగ్‌.. హర్మూజ్‌లో చిక్కుకున్న నౌకలకు కొత్త కష్టం..!

  • హర్మూజ్‌‌లో నెలల తరబడి నిలిచిన నౌకలు
  • నౌకలపై బార్నకిల్స్‌, ఆల్గే భారీగా పెరుగుదల
  • ప్రయాణానికి ముందు తప్పనిసరి శుభ్రపరిచే పనులు
  • ఒక్కో నౌకకు వేల డాలర్ల అదనపు ఖర్చు
  • డైవర్ల సేవలకు భారీ డిమాండ్‌
  • ఇంధన వినియోగం, కార్బన్‌ ఉద్గారాల పెరుగుదల
యుద్ధం ఆగింది. సముద్ర మార్గాలు మళ్లీ తెరుచుకుంటున్నాయి. చమురు రవాణా సాధారణ స్థితికి చేరుతుందన్న ఆశలు కనిపిస్తున్నాయి. కానీ నెలల తరబడి హర్మూజ్‌ జలసంధిలో నిలిచిపోయిన వందలాది నౌకలకు ఇప్పుడు మరో సమస్య ఎదురైంది. అది శత్రు దాడి కాదు. సముద్రంలో అమర్చిన మైన్లూ కాదు. సముద్రంలో ఉండే చిన్న చిన్న జీవులు. వింటే ఆశ్చర్యంగా ఉంది కదా! వివరాల్లోకి వెళితే.. 

నౌకలు మళ్లీ ప్రయాణం మొదలుపెట్టే ముందు వాటి అడుగు భాగాన్ని పూర్తిగా శుభ్రం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. నెలలుగా కదలకుండా ఉండటంతో నౌకలపై ‘బార్నకిల్స్‌’, ‘ఆల్గే’, ‘మసెల్స్‌’ వంటి సముద్ర జీవులు పెద్ద ఎత్తున పేరుకుపోయాయి. బయటకు చిన్న సమస్యలా కనిపిస్తున్నా.. షిప్పింగ్‌ రంగానికి ఇది పెద్ద ఆర్థిక భారంగా మారింది.

సముద్ర రవాణా రంగంలో దీనిని ‘బయోఫౌలింగ్‌’ అంటారు. నౌక నీటిలో ఉండే భాగాలపై సూక్ష్మ జీవులు, ఆల్గే, గుల్లలు, ‘బార్నకిల్స్‌’ పేరుకుపోవడం దీనిలో భాగం. ఇవి పెరిగే కొద్దీ నౌక అడుగు భాగం గరుకుగా మారుతుంది. ఫలితంగా నీటిలో ముందుకు కదలడానికి ఇంజిన్లు ఎక్కువ శక్తి వినియోగించాల్సి వస్తుంది. దీంతో ఇంధన ఖర్చు గణనీయంగా పెరుగుతుంది.

హర్మూజ్‌ జలసంధి నెలల తరబడి అంతరాయానికి గురికావడంతో వేల కోట్ల డాలర్ల విలువైన సరకులతో ఉన్న నౌకలు అక్కడే నిలిచిపోయాయి. సాధారణంగా నిరంతరం ప్రయాణంలో ఉండే నౌకలపై ఇంత స్థాయిలో సముద్ర జీవులు పేరుకుపోవు. కానీ గల్ఫ్‌ ప్రాంతంలోని వెచ్చని నీటిలో నెలల తరబడి కదలకుండా ఉండటంతో జీవుల పెరుగుదలకు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి. కొన్ని నౌకలపై జెల్లీఫిష్‌లు కూడా కనిపించినట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.

ఇప్పుడు ఈ నౌకలను మళ్లీ కదిలించడానికి పెద్ద ఎత్తున క్లీనింగ్‌ ప్రాసెస్‌ చేపట్టాల్సలిన పరిస్థితి ఏర్పడింది. గల్ఫ్‌ ప్రాంత పోర్టుల్లో డైవర్లు నీటిలోకి దిగి నౌకల అడుగు భాగాలను శుభ్రం చేస్తున్నారు. ఒక్కో నౌకను శుభ్రం చేయడానికి వేల డాలర్లు ఖర్చవుతున్నాయి. డిమాండ్‌ ఒక్కసారిగా పెరగడంతో ఈ సేవల ధరలు కూడా వేగంగా పెరుగుతున్నాయి. షిప్పింగ్‌ కంపెనీలకు ఇది అదనపు భారం అయింది.

సమస్య అక్కడితో ఆగిపోలేదు. నెలల పాటు నౌకలు నిలిచిపోవడంతో రవాణా షెడ్యూళ్లు దెబ్బతిన్నాయి. ఆదాయం లేకపోయినా సిబ్బంది జీతాలు, బీమా, నిర్వహణ ఖర్చులు మాత్రం కొనసాగాయి. ఇప్పుడు మళ్లీ ప్రయాణానికి సిద్ధం చేసే పనుల కోసం మరోసారి భారీ మొత్తాలు వెచ్చించాల్సి వస్తోంది.

నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇది కేవలం హర్మూజ్‌‌కే పరిమితమైన సమస్య కాదు. యుద్ధాలు, సముద్ర దోపిడీలు, ఆంక్షలు, ప్రకృతి విపత్తులు లేదా పోర్టుల్లో రద్దీ వల్ల నౌకలు ఎక్కువకాలం నిలిచిపోతే ఇదే పరిస్థితి తలెత్తే అవకాశం ఉంది. అందుకే భవిష్యత్తులో షిప్పింగ్‌ రంగం ప్రమాదాలను అంచనా వేసే విధానంలో కూడా మార్పులు రావచ్చని చెబుతున్నారు.

ఇక పర్యావరణపరంగా కూడా ఇది ఆందోళన కలిగించే అంశమే. నౌకలపై జీవులు పేరుకుపోతే ఇంధన వినియోగం పెరుగుతుంది. దాంతో కార్బన్‌ ఉద్గారాలు కూడా అధికమవుతాయి. అంటే హర్మూజ్‌ సంక్షోభం ప్రభావం కేవలం వాణిజ్యంపైనే కాదు.. పర్యావరణంపైనా పడుతోంది. చిన్న సముద్ర జీవులు ప్రపంచ వాణిజ్యానికి ఎంత పెద్ద సవాలుగా మారగలవో ఈ ఘటన చూపించింది.

Strait of Hormuz
Biofouling
Shipping Industry
Marine Growth
Gulf Region
Ship Maintenance

More Telugu News